దివంగత తెలుగు పాటల రచయిత, సినీ వినీలాకాశంలో వెలిగిన ధృవతార ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. విశాఖ సాగర తీరాన్ని అనుకుని ఉన్న వుడా లే అవుట్ లో 500 గజాల ఇంటి స్థలం కేటాయించింది. అనకాపల్లి జిల్లాలోనే పుట్టి పెరిగిన సీతారామశాస్త్రికి విశాఖపట్నంతో ఎంతో అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన జ్ఞాపకార్ధం తాజాగా విశాఖలో స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు సిరివెన్నెల అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి ఖర్చులన్ని ప్రభుత్వమే భరించింది. కాగా అనారోగ్యం కారణంగా నవంబర్ 30, 2021లో ఆయన తుది శ్వాస విడిచారు. సిరివెన్నెల మరణం తెలుగు సినిమా సంగీత ప్రపంచానికి ఎన్ని తరాలు అయినా తీరని లోటుగానే మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.