స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై గత కొద్దీరోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం కూడా విదితమే. ఈ క్రమంలో ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడానికి నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షంలో సెక్రటేరియట్‌లో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. నేటి ఉదయం 11గంటలకు మంత్రి వర్గం సమావేశమవుతాయి. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో కొత్త పథకాల అమలు, ప్రస్తుతం అమలవుతున్న పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు, రైతులను సంతృప్తిపరిచే విధంగా ఈ కేబినెట్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.
సీపీఎస్ రద్దు చేసి కొత్త విధానం తీసుకువచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేలా కేబినెట్ లో నిర్ణయం ఉంటుందని సమాచారం. అదేజరిగితే సుమారు 10వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనుంది.
పీఆర్సీ, డీఏ బకాయిలు 16వాయిదాల్లో చెల్లించేలా నిర్ణయంతో పాటు యూనివర్సిటీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62ఏళ్లకు పెంచుతూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. అదేవిధంగా సీపీఎస్ రద్దు చేసి మెరుగైన పెన్షన్ విధానం అమలు చేసేలా మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. త్వరలో గ్రూప్-1, గ్రూప్ -2 ఉద్యోగాల నోటిఫికేషన్ జారీకి కేబినెట్ ఆమోదం తెలుపుతుందని సమాచారం. అదేవిధంగా త్వరలో అమలు చేసే సంక్షేమ పథకాలపైనా కేబినెట్లో చర్చ జరగనుంది. జూన్, జులై నెలలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలకు మంత్రివర్గం సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. అమరావతిలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.
సీఎం జగన్ తో జరుగుతున్న మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలతో పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసనమవుతున్న నేపథ్యంలో కొత్త పథకాలతో పాటు, పలు వర్గాల ప్రజలపై వరాల జల్లుకురిపించేలా కేబినెట్ లో నిర్ణయాలు ఉంటాయని సమాచారం. దీనికితోడు ఇటీవల సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తరువాత అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ పైనా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.