ఎన్నికలు సమీపిస్తున్నా…. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే ఉంది. తెలంగాణ నుంచి 17 స్థానాల్లో ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించా ల్సి ఉండగా.. మరో స్థానానికి అభ్యర్థిని ప్రకటిస్తూ మరో లిస్ట్ రిలీజ్ చేసింది. వరంగల్ నుంచి కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించింది హైకమాండ్. ఇంకా… హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కీలక స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో అధికార పార్టీ తర్జనభర్జనలు పడుతోంది. కరీంనగర్ అభ్యర్థిగా తెర మీదకు రోజుకో పేరు వస్తోంది. బీసీ, రెడ్డి, వెలమల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు మధ్య పోటీ నెలకొంది.
మరోవైపు… ఖమ్మం స్థానానికి కూడా గట్టి పోటీ కనిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డిని ఖమ్మం సీటులో కూర్చోబెట్టాలని తపన పడుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరావు కూడా ఈ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తన తనయుడు తుమ్మల యుగంధర్‌ను ఇక్కడ పోటీకి పెట్టాలనేది ఆయన ఆలోచన. బీఆర్ఎస్, బీజేపీలతో పోల్చితే కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే తలమునకలైంది.


