తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు మరో ముగ్గురుతో తనకు ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరాడు.
చంద్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సహిత సెక్షన్ల కింద హరీష్ రావుపై 351(2),ఆర్ డబ్ల్యు 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.ఎఫ్.ఐ.ఆర్ లో ఏ2గా హరీష్ రావును చేర్చారు పోలీసులు. త్వరలోనే ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే తన ఫోన్ ను ట్యాప్ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హరీష్ రావుపై చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హరీష్ రావుపై కేసు నమోదైంది. ఈ కేసులో తనను అరెస్టు చేయవద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో.. విచారించిన న్యాయస్థానం హరీష్ రావును అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హరీశ్‌రావుకు ఊరట లభించింది. ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదైంది.
టన్నెల్ దగ్గర ఆందోళన
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సందర్శనకు వచ్చిన హరీశ్‌రావు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎన్నికల ప్రచారమే ముఖ్యమని.. ప్రజలు ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు సంధించారు. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్, ఆయన కుటుంబం.. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
ఈ సందర్బంగా జూపల్లి హరీశ్‌రావుకు మూడు ప్రశ్నలు వేశారు
టన్నెల్‌ను 200 మీటర్లు తవ్వి మిగతాది ఎందుకు వదిలేశారు?
కాంట్రాక్లులో తక్కువ లాభం వస్తుందన్న అంచనాతోనే వదిలేశారా?
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన టన్నెల్ నిర్మాణం పూర్తి అయితే మీకు పేరు రాదు కాబట్టి వదిలేశారా?