కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా పనితీరు అద్భుతమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టెర్రరిస్ట్, నక్సలైట్ సహా ఏ సమస్య వచ్చినా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తారని కొనియాడారు. ప్రతి పౌరుడికీ రక్షణ కల్పించాలనే ఆలోచనతో అమిత్ షా పనిచేస్తారని ప్రశంసించారు.
“శాంతి భద్రతలు కాపాడటంలో అమిత్‌షాది ప్రత్యేక శైలి. అమిత్ షా పనితీరు చూస్తే నాకు అసూయ కలుగుతుంది. 2014లోనే ఎన్డీఆర్‌ఎఫ్ క్యాంపస్‌కు శంకుస్థాపన జరిగింది. 2018లో ఎన్‌ఐడీఎం క్యాంపస్‌కు శంకుస్థాపన పడింది. ఈ రెండు క్యాంపస్‌ల కోసం 50 ఎకరాలు కేటాయించాం. ఇప్పుడు అమిత్ షా చేతుల మీదుగా 2 క్యాంపస్‌లు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ” అని చంద్రబాబు అన్నారు.
క్లిష్ట సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయని చంద్రబాబు చెప్పారు. విజయవాడ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు ప్రశంసనీయమన్నారు. కేంద్రం ఆర్థిక సాయంతో విశాఖ ఉక్కుకు ఊపిరిపోసిందని ఈ సందర్భంగా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఊపిరిపోసినా.. రాష్ట్రం ఇంకా పేషెంటేనని పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని బాగుచేస్తున్నామని వ్యాఖ్యానించారు. పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం జరుగుతోందని .. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు.
విజయవాడ నగరానికి సమీపంలోని కొండపావులూరులో 20వ ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రహోమంత్రి అమిత్‌షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NIDM) ప్రాంగణాన్ని అమిత్‌షా ప్రారంభించారు.
ఎన్డీఆర్‌ఎఫ్ రైజింగ్ డేలో హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. రూ.160 కోట్ల వ్యయంతో ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం క్యాంపస్‌లు ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ 10 బెటాలియన్‌ను అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఎలా పనిచేస్తాయి?.. ఎలాంటి సహాయక చర్యలు చేపడతాయి?.. ఎంత త్వరగా ప్రజలను సురక్షత ప్రాంతాలకు తరలిస్తారు?.. అనే విషయాలను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రదర్శించాయి. వీటిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిలకించారు.