తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ముస్లింల రిజర్వేషన్ ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కారు స్టీరింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉందని.. మజ్లిస్ పార్టీ చెప్పినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని.. 90 అసెంబ్లీ, 12 ఎంపీ సీట్లే తమ లక్ష్యమన్నారు. పవర్ లోకి వచ్చిన వెంటనే అక్రమార్కుల భరతం పడతామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని షా ఆరోపించారు.
పేపర్ లీకేజీలపై ఇప్పటివరకు కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. లీక్ కేసులో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారని.. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినంత మాత్రాన భయపడరన్నారు. నిరుద్యోగుల జీవితాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. 2024 ఎన్నికల్లో కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని.. ఎన్ని కలలు కన్నా మోదీనే మళ్లీ ప్రధాని అవుతారని అమిత్ షా స్పష్టం చేశారు.