Telangana | కొన్నికొన్ని సార్లు మనుషులకు వచ్చే కష్టాలు చూస్తే.. దేవుడా.. ఏం పాపం చేశాడని ఇంతటి కష్టం వచ్చింది అనిపిస్తుంది. అసలు ఒక్కోసారి మనసు విరిగిపోయి నాకే ఎందుకు ఈ కష్టాలు.. ఏ దేవుడు లేదు.. ఎవరూ నా కష్టాన్ని తీర్చలేరు అనిపిస్తుంది. బాధాతప్త హృదయం బరువెక్కితే చచ్చిపోవడానికి కూడా వెనకాడరు. కానీ, నిజానికి దేవుడు కష్టాలు ఇచ్చేది నీ గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని బయటపెట్టేందుకే. నీకు ఎంతటి కష్టం వచ్చినా అది తట్టుకొని నిలబడి.. ఆ సమయాన ఏది కర్తవ్యమో అది చేయు చాలు. సమస్త సమాజం నిన్ను కీర్తిస్తుంది. నిన్ను ఆదర్శంగా తీసుకుంటుంది. నీలాగా మరో నలుగురు మారడానికి ప్రేరణ అవుతుంది… తాజాగా ఓ విద్యార్థి తీసుకున్న నిర్ణయమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం గ్రామానికి చెందిన రోహిత్ అనే టెన్త్ క్లాస్ విద్యార్థి తండ్రి నిన్న రాత్రి అనారోగ్యం చేత మరణించారు. రేపు పదవ తరగతి పరీక్ష అని సంతోషంగా రాయాలి అన్న ఆ విద్యార్థి మనసుకు తండ్రి మరణ వార్త గుండె బరువెక్కేలా చేసింది. చదువుపై ఎంతో ఆసక్తి ఉన్న ఆ విద్యార్థి.. గుండెను రాయిని చేసుకొని అయినా సరే… పరీక్షా రాయాలని నిర్ణయించుకున్నాడు. అదే నిర్ణయంతో నేడు పరీక్షకు హజరయ్యాడు. పరీక్ష అనంతరం అంత్య క్రియల్లో పాల్గొన్నాడు. గుండెంత బరువున్న ఆ విద్యార్థి చేసిన సాహసాన్ని తోటి విద్యార్థులు సహా.. ఆ ఊరు ఊరంతా ప్రశంసల జల్లు కురిపించారు.
ఒక్కోసారి దేవుడుపెట్టిన కష్టాలు తట్టుకొని నిలబడితే ఎంతటి కీర్తివంతులు అవుతామో ఈ ఘటన నిరూపిస్తుంది. చదువు అంటే మొండికేసి.. విద్య పట్ల నిర్లక్ష్యంగా ఉన్న విద్యార్థులకు ఈ ఘటనను ఆదర్శంగా తీసుకోవడానికే దేవుడు ఇలా చేశాడేమో అనిపిస్తుంది. ఏదేమైనా చదువు అంటే భయపడే విద్యార్థులు.. ఈ ఘటనను ఆదర్శముగా తీసుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి.