స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు శత జయంతిని పురస్కరించుకొని ఎఫ్‌టీపీసీ ఇండియా, తెలుగు సినిమా వేదిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఏఎన్నార్ సెంటినరీ పాన్ ఇండియా అవార్డ్స్ వేడుక ప్రసాద్ ల్యాబ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. సీనియర్ నటులు మురళి మోహన్, నిర్మాతలు రమేష్ ప్రసాద్ , దామోదర్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, వైవీఎస్ చౌదరి, ప్రసన్న కుమార్, సామాజికవేత్త వరలక్ష్మి, ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్ ముఖ్య ఆతిథులుగా విచ్చేసిన ఈ వేడుకలో సినీ, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులను ఘనంగా సత్కరించారు. సంస్థ వ్యవస్తాపకులు చైతన్య జంగా, వీస్ విజయ్ వర్మ పాకలపాటి వివిధ రంగాలకు చెందిన ఇంత మందిని ఒక్క చోటకు చేర్చి సత్కరించటం ఎంతో ఆనందదాయకమని, అక్కినేని నాగేశ్వర్రావు గారి అభిమానినైన తాను ఆయన శతజయంతి వేదికకు ముఖ్య అతిధిగా హాజరు కావడం చాలా ఆనందం వేసిందని మురళి మోహన్ అన్నారు.
నిత్య విద్యార్థిగా వుండే ఆయన తత్త్వం ఎంతో ఆదర్శప్రాయమని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మా అందరికి ఆయన ఓ టీచర్ లాంటి వారని, క్రమ శిక్షణ వినయ విధేయతలు అనేవి ఆయనతో ఒక్కరోజు గడిపితే అలవాటు అయిపోతాయని అన్నారు. చివరి రోజులవరకు ఆయనతో అత్యంత సన్నిహితంగా గడిపిన భాగ్యం తనకు దక్కిందని అవార్డు గ్రహీత కాదంబరి కిరణ్ అన్నారు. ఆయనతో గడిపిన ప్రతి క్షణం అమూల్యమైనదని నిర్మాత ప్రసన్న కుమార్ అన్నారు. తనను ఆప్యాయంగా పలకరించి అభిమానించిన పెద్దలు అక్కినేని నాగేశ్వరరావుగారని దర్శకులు వైవీఎస్ చౌదరి కొనియాడారు.
సినిమాపరంగా, కుటుంబపరంగా ఆయనతో తమ సాన్నిహిత్యం ఎంతో మధురమైనదని రమేష్ ప్రసాద్ అన్నారు. ఎఫ్‌టీపీసీ అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా మరోసారి ఆయన్ని స్మరించుకొనేలా చెయ్యాలన్న ఉద్దేశ్యంతోనే 10 రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను సత్కరించుకొనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు వీస్ విజయ్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ .. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఆయన అభిమానులతోపాటు వివిధ రంగాల ప్రముఖులను సత్కరించుకొనే అవకాశం కలగడం పూర్వ తమ సంస్థలకు గర్వకారణమని అన్నారు. అంగరంగవైభవంగా నిర్వహించిన చైతన్య జంగా, వీస్ విజయ్ వర్మ పాకలపాటిలను ముఖ్య అతిధులు, అవార్డు గ్రహీతలు ప్రశంసించారు!!


