స్వతంత్ర, వెబ్ డెస్క్: మృగశిర కార్తె వేళ చేప మందు పంపిణీకి సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 9, 10 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా చేప మందు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరానికి చెందిన బత్తిన సోదరుల ఆధ్వర్యంలో మందు తయారీ, పంపిణీ జరుగుతుంది.
ప్రభుత్వమే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తుంది. చేప మందు కోసం అవసరమైన చేప పిల్లలను ప్రభుత్వమే సేకరించి, అందిస్తుంది. శాకాహారుల కోసం బెల్లంతో కలిపిన మందును అందిస్తారు. బత్తిన కుటుంబం 60 ఏళ్లుగా దీన్ని పంపిణీ చేస్తుండగా, వీరి పూర్వీకులు దాదాపు 170 ఏళ్ల నుంచి చేప మందు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం బత్తిన కుటుంబానికి చెందిన 250 మంది సభ్యులతోపాటు, వాలంటీర్లు, కొన్ని సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్నాయి. ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. చేప మందు ఉబ్బసం వ్యాధిని తగ్గిస్తుందని చాలా మంది నమ్మకం. అందుకే ఈ వ్యాధి ఉన్నవాళ్లు చాలా మంది ప్రతి ఏటా చేప మందు తీసుకుంటారు.
తెలంగాణ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది చేప మందు కోసం వస్తుంటారు. కరోనా వల్ల మూడేళ్లుగా ఈ మందు పంపిణీ చేయలేదు. ఈ సారి అలాంటి ఇబ్బందులేమీ లేకపోవడంతో ప్రభుత్వం చేప మందుకు సిద్ధమైంది. గతంలోనే ఈ విషయంపై బత్తిన కుటుంబం.. మంత్రి తలసానికి కలిసింది. చేప మందు పంపిణీకి సహకరించాల్సిందిగా కోరింది. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి, తగిన ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇక్కడికి రాని వాళ్ల కోసం చేప మందును ఇంటికి తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మందు కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.
అదనపు బస్సులు, మెట్రో సర్వీసులు, వైద్య సదుపాయం, ఆహారం అందించే ఏర్పాట్లు కూడా చేస్తోంది. మందు కోసం వచ్చే వారి వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా గోషామహల్ ప్రజలు సహకరించాలని మంత్రి తలసాని కోరారు. కాగా, ఈ మందు విషయంలో గతంలో అనేక వివాదాలు నడిచాయి. ఈ మందు ఆస్తమా/ఉబ్బసాన్ని తగ్గించలేదని కొందరు వాదించారు. ఈ విషయం శాస్త్రీయంగా నిరూపణ కాలేదన్నారు. అయినప్పటికీ చాలా మంది దీనిపై నమ్మకంతో మందు కోసం వస్తుంటారు.