Adani Issue: అదానీ వ్యవహారం గత కొద్ది రోజులుగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ వైపు అదానీ బ్యాంకులను ముంచాడని, అయితే కేంద్రప్రభుత్వం మాత్రం అదానీపై ప్రేమను చూపిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్టాక్ ధరల్లో అదానీ అవకతవకలకు పాల్పడ్డారని, సెబీ నిబంధనలు ఉల్లఘించారంటూ హిడెన్ బర్గ్ వెల్లడించడంతో అదానీ టార్గెట్‌గా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
అయితే కేంద్రప్రభుత్వం అదానీ విషయంలో మౌనంగా ఉంటోందని, ఎంతో మంది ప్రజలకు సంబంధించిన విషయం కావడంతో కొందరు ఈ విషయంలో నిజాలు నిగ్గుతేల్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిగిన న్యాయస్థానం వాస్తవాలను తేల్చేందుకు ఓ కమిటీని నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రప్రభుత్వం కమిటీ కోసం నియమించిన పేర్లను సుప్రీం కోర్టుకు అందించగా.. కేంద్రం సూచించిన పేర్లపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈక్రమంలో న్యాయస్థానమే ఓ కమిటీని నియమించింది.
అదానీ -హిడెన్‌బర్గ్ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఏఎం సప్రే నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. భారతీయ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీంకోర్టుకు నిపుణుల కమిటీ 2 నెలల్లో నివేదిక అందించనుంది. ఈ కమిటీ సభ్యులు విచారణ అనంతరం నివేదికను సీల్డ్‌కవర్‌లోసుప్రీంకోర్టుకు అందచేస్తారు. కాగా, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడడానికి దీనిపై లోతైన దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో నందన్ నీలేకని, ఓపీ భట్, జస్టిస్ జేపీ దేవధర్, కెవి.కామత్, సోమశేఖర్ సుందర్ సేన్ సభ్యులుగా ఉన్నారు.
సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా? స్టాక్ ధరలలో ఏమైనా అవకతవకలు జరిగాయా? అనే దానిపై దర్యాప్తు చేయాలని సెబీని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది . 2 నెలల్లో విచారణ జరిపి స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సెబీని ఆదేశించింది.
Read Also: ఎన్నికల కమిషనర్ల నియామకంలో పాతపద్ధతికి గుడ్‌బై.. ఇలా చేయాల్సిందేనన్న సుప్రీం..
Follow us on: Youtube