ప్రధాని నరేంద్ర మోదీపై ఓ పండితుడు మహాకావ్యాన్నిరచించారు. ఆయనే ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సంస్కృత పండితుడు సోమనాథ్ దశ్. ప్రస్తుతం ఆయన ఏపీలోని తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మోదీ జీవన ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, ఆయన రాసిన రచనలను వివరిస్తూ 12 అధ్యాయాలు.. 1200 శ్లోకాలతో ‘నరేంద్ర ఆరోహణం’ పేరిట ఈ మహాకావ్యాన్ని రాశానని సోమనాథ్ వెల్లడించారు. ఈ గ్రంథ రచనకు ప్రతాపరుద్రీయం, కావ్యప్రకాశం వంటి ప్రాచీన, సంస్కృత ఇతిహాసాల శైలిని అనుసరించానని చెప్పారు. దీనిని రాయడానికి ఆయనకు నాలుగు ఏళ్లు పట్టిందని సోమనాథ్ వివరించారు.
ఇటీవల గుజరాత్‌లోని వెరావల్‌లో జరిగిన యువజనోత్సవ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు సోమనాథ్ పేర్కొన్నారు. ఈ కావ్యాన్ని హిందీ, ఆంగ్ల భాషల్లో అనువదించానని వెల్లడించారు. ప్రధాని మోదీ జీవన విధానం, రాజకీయ ప్రయాణం ఎల్లప్పుడూ చరిత్రలో నిలిచిపోతాయని సోమ్‌నాథ్ అన్నారు. పలు వార్తా పత్రికలు, పుస్తకాలు, ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం మొదలైన వాటి నుంచి సమాచారం తీసుకుని పుస్తకాన్ని రాసినట్టు సోమ్‌నాథ్ తెలిపారు.