స్వతంత్ర వెబ్ డెస్క్: నోయిడా ఫిలిం సిటీలో ఫ్యాషన్ షో ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాంప్ వాక్‌లో ఇనుప స్తంభం పడి 24 ఏళ్ల మోడల్ మరణించిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. నోయిడా ఫిల్మ్ సిటీలో ఆదివారం ఫ్యాషన్ షో సందర్భంగా ర్యాంప్ వాక్ చేస్తూ 24 ఏళ్ల మోడల్ అయిన వంశిక చోప్రా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. లైట్ల కాంతుల్లో మోడల్ వంశిక చోప్రా ర్యాంప్ వాక్ చేస్తుండగా ఒక్కసారిగా లైట్ల స్తంభం వారిపై పడింది. దీంతో మోడల్ వంశిక అక్కడికక్కడే మరణించింది. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు వంశిక చోప్రా, గాయపడిన వ్యక్తి బాబీ రాజ్ ఫ్యాషన్ షోలో పాల్గొంటుండగా ఈ ప్రమాదం జరిగింది. షో నిర్వాహకులను, లైటింగ్ ట్రస్‌ను అమర్చిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసి మోడల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రెండు కుటుంబాలకు సమాచారం అందించామని పోలీసులు చెప్పారు. మృతదేహానికి సంబంధించిన పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని నోయిడా అదనపు డీసీపీ శక్తి అవస్థి చెప్పారు.