ఫోన్‌లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉన్మాదిపై చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత అభ్యర్థిస్తున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతుంది. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆలంపురం గ్రామానికి చెందిన ఓ మహిళ జీవనోపాధి నిమిత్తం ఇండియా నుంచి బెహరాన్ వెళ్ళింది. కాల్దరికి చెందిన చీపుళ్ళ మహేష్ అనే వ్యక్తి తనకు తరచుగా ఫోన్లు చేసి లైంగికంగా వేధిస్తున్నాడంటూ అవేదన వ్యక్తం చేసింది.
దీంతో తన తండ్రి, భర్తకు విషయం తెలిపానని చెప్పింది. ఈ వ్యవహారం కారణంగా తన కాపురంలో మనస్పర్థలు తలెత్తాయని వాపోతోంది. ఈ విషయమై తన తండ్రి, భర్త కలసి వారి పరిధిలో ఉన్న చేబ్రోలు, పెంటపాడు పోలీస్టేషన్లకు వెళ్లి తన తరపున ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయింది. ఇక చేసేది లేక కన్నీటి పర్యంతమవుతూ తనకు న్యాయం జరగకపోతే చనిపోతానంటూ ఒక సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
తనను వేధిస్తున్న మహేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రాణ త్యాగానికి సైతం వెనకాడనని బాధితురాలు హెచ్చరించింది. సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు మహిళ ఆవేదనను పట్టించుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై పోలీసులు, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.