భారత న్యాయ వ్యవస్థలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దశాబ్ధాల కాలం నాటి నుంచి సుప్రీంకోర్టులో న్యాయ దేవతకున్న కళ్ల గంతలు తొలగిపోయాయి. బ్రిటీష్ వలసపాలన, నాటి విధానాలకు స్వస్తి చెబుతూ సుప్రీంకోర్టులో న్యాయ దేవత కళ్లకున్న గంతలు ఉండకూడదని.. దేశ అత్యున్నత ధర్మాసనమైన సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశాలతో సుప్రీంకోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే,.. ఈ న్యాయ దేవత కళ్లకు గంతలు లేపకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. ఇన్నాళ్లూ న్యాయ దేవత కుడి చేతిలో న్యాయానికి ప్రతిబింబంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. సుప్రీం కోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ దేవత విగ్రహం ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం ఉండటం గమనార్హం.
సుప్రీంకోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఈ విగ్రహాన్ని ఉంచారు. న్యాయం గుడ్డిది కాదని, చట్టానికి కళ్లున్నాయని బలమైన సంకేతమిచ్చే ఉద్దేశంతోనే న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేశారు. సమాజంలో సమతౌల్యాన్ని, న్యాయ ప్రమాణాలను సూచించే న్యాయదేవత కుడి చేతిలోని త్రాసులో ఎలాంటి మార్పు చేయలేదు. కేసులో ఇరు వర్గాల వాదనలు, వాస్తవాల ఆధారంగా కోర్టు ఇచ్చే తీర్పులకు సంకేతంగా ఈ తూకాన్ని పరిగణిస్తారు.
చట్టం ముందు అందరూ సమానమే.. న్యాయస్థానం డబ్బు, అధికారం, ఇతర హోదాను చూడదు అనే సందేశమిచ్చేందుకే న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టేవారు. కుడి చేతిలో ఉండే త్రాసు న్యాయానికి సూచికగా ఉండేది. ఎడమ చేతిలో ఖడ్గం అన్యాయాన్ని న్యాయదేవత సహించదని, చీల్చిచెండాడుతుందని సంకేతం ఇచ్చేందుకు ఇలా న్యాయదేవత విగ్రహం చేతిలో ఖడ్గాన్ని ఉంచారు.