దక్షిణాది రాష్ట్రాలను వణికించిన ఫెయింజల్ తుఫాన్ బలహీనపడింది. పుదుచ్చేరి నుంచి నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న తుపాను ఇవాళ రాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తుండగా.. మరో 3 రోజులపాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడులో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ కేంద్రం. ఏపీలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్ఠంగా 60 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్య్సకారులు వేటుకు వెళ్లొద్దని సూచించింది.
ఫెంగల్ తుఫాన్ ఇప్పటికే పలురాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఏపీ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో బీభత్సం సృష్టించింది. ఏపీలోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలపై విరుచుకుపడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన జోరు వానలతో తిరుపతి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సత్యవేడు, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరుపతిలో మామిడి కాలువ, పాముల కాలువ, కార్వేటి కాలువ, ఈదులకాలువ, సున్నపు కాలువలతో సహా 21 కాలువలు పొంగి పొర్లుతున్నాయి. తిరుమలలోని రెండో ఘాట్ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. సకాలంలో టీటీడీ సిబ్బంది స్పందించి వాటిని తొలగించింది. ఘాట్ రోడ్లపై దట్టమైన పొగమంచు కమ్మడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వర్షానికి తోడు చలి తీవ్రత పెరగడంతో జనాలు నానాపాట్లు పడుతున్నారు.
అకాల వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కోతలు పూర్తయిన చోట్ల ధాన్యాన్ని రోడ్లపై రాశులు పోయగా.. అదీ తడిసిముద్దైంది. పలు జిల్లాల్లో కంది, మిరప వంటి పంటలు పూత దశలో ఉండటంతో గాలులకు రాలిపోయింది. అకాల వర్షాల వల్ల పంటలు తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కోతకు వచ్చిన వరి, రాగి, మొక్కజొన్న పంటలు వానలకు దెబ్బ తిన్నాయి. శ్రీకాకుళంలో చెదురుమదురు జల్లులు పడ్డాయి.