కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 23వ తేదిన హైదరాబాద్ రానున్న ఆయన.. ఆస్కార్ అవార్డు అందుకున్న RRR చిత్ర బృందాన్ని సన్మానించనున్నారు. ఏప్రిల్ 23 మధ్యాహ్నం మూడు గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్న షా.. 3.50గంటలకు నోవాటెల్ హోటల్ చేరుకుంటారు. 4గంటల నుంచి 4.30గంటలకు RRR చిత్ర యూనిట్ తో తేనేటీ విందులో పాల్గొని వారిని సన్మానిస్తారు. ఈ బృందంలో రాజ్యసభ సభ్యుడు, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్ రాజమౌళి, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఉన్నారు.
అనంతరం బీజేపీ కోర్ కమిటీతో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం సాయంత్ర 6గంటలకు చేవెళ్లలో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగసభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా గతేడాది కూడా తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా జూ.ఎన్టీఆర్, హీరో నితిన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.