ఉత్తరప్రదేశ్ లో కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ లను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. శనివారం రాత్రి వీరిద్దరిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. అక్కడే విలేకర్ల ముసుగులో ఉన్న దుండగులు ఇద్దరిని పాయింట్ బ్లాంక్ లో తుపాకీతో కాల్చారు. దీంతో వారు స్పాట్ లోనే చనిపోయారు. మీడియా, పోలీసుల సమక్షంలోనే కాల్పులు జరగడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాల్పులకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కాల్పుల ఘటనపై విచారణకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ముగ్గురి సభ్యులతో కూడిన జ్యూడిషియల్ కమిటీని నియమించారు. పోలీసుల సమక్షంలోనే కాల్పులు జరగడంపై సమాజ్ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఘటన చూస్తే అర్థమవుతోందని ముఖ్యమంత్రి యోగిపై మండిపడ్డారు.
కాగా అతీక్ పెద్ద కుమారుడు అసద్ గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య కేసులో వీళ్లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. అతీఖ్, అష్రాఫ్ హత్యలతో 44 ఏళ్లుగా నిర్మించుకున్న వీరి నేర సామ్రాజ్యం తుడుచుపెట్టుకుపోయింది.