ఈ మధ్య రాజకీయాల్లో గెలుపు అవకాశాల కోసం కొంతమంది నేతలు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతున్నారు. గెలవడానికి అన్ని అవకాశాలున్నా ఒక్కోసారి అదృష్టం కలిసిరాదు. దీంతో జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం రకరకాల ఉంగరాలను చేతికి ధరిస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చారు. దశాబ్ద కాలంగా రాజకీయాల్లో పోరాడుతున్న పవన్ కు విజయం అందిన ద్రాక్ష లాగే ఉంది. 2024 ఎన్నికలు జనసేన పార్టీతో పాటు పవన్ భవిష్యత్ కు ఎంతో కీలకం కానున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం పవన్ కల్యాణ్ పై ప్రజల అభిప్రాయం మారడంతో జనసేన పార్టీకి సానుకూల పవనాలు కన్పిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అతి త్వరలో వారాహి యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్నారు. ఎన్నికలు అయిపోయే వరకు పూర్తిగా జనాల్లోనే ఉండనున్నారు. ఈసారి కచ్చితంగా విజయం సాధించి తాను అసెంబ్లీలో అడుగుపెట్టడంతో పాటు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని పట్టుదలతో ఉన్నారు జనసేనాని. అందుకే జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముకున్నారు. కుడి చేతికి బంగారంతో తయారుచేసిన తాబేలు ఉంగారాన్ని పవన్ ధరించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరం ధరిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మంచి విజయాలు అందుతాయట. అందుకే పవన్ ఈ ఉంగరాన్ని ధరించారని పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది.


