కారణాలు ఏవైనా, తప్పిదాలు ఎవరివైనా…చేతులు కాలిపోయాక పత్రాలతోను, నిండా మునిగిపోయాక రక్షణ చర్యలతోను ఏం ఫలితం ఉంటుంది. ప్రైవేట్ ను పరోక్షంగా ప్రోత్సహించే ప్రభుత్వాలు.. ఆ ప్రైవేట్ పై ప్రత్యక్షంగా దండయాత్ర సాగిస్తాయి, ప్రైవేట్ విజృంభణకు ఆ ప్రభుత్వమే కారణం అని ఈ ప్రభుత్వం…కాదు వీరే కారణం అ ని వారు.. అధికార పక్షం, ప్రతి పక్షం.. అన్నింటి మీద విమర్శలు చేసుకునే మాదిరిగానే పబ్లిక్, ప్రైవేట్ మీద విమర్శలు సాగిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విషయంలో ముఖ్యంగా స్కూళ్ల పరిస్థితి తీసుకుంటే… సర్కారు బడులకు వెతలు, ప్రైవేట్ స్కూళ్లకు జేజేలు కనబడుతున్నాయి.
ప్రైవేటు పాఠశాలలు అంటే ఎవరివి…ధనవంతులకు చెందినవి. ఈ ధనవంతుల్లో అధిక శాతం మంది ఎవరు..? నిస్సందేహంగా రాజకీయ నాయకులే. ఏదో ఓ పార్టీలో ఉండే ఈ ప్రైవేటు విద్యాలయాల యజమానులు…విపక్షంలో ఉన్న మాట అలా ఉంచితే, అధికారంలో తమ పార్టీ ఉంటే పదవుల్లో ఉంటారు. మరి విద్యాశాఖో, ఉపాధి శాఖో..మరో ముఖ్యశాఖలో ఆమాత్యులుగా ప్రైవేటు విద్యాలయాల అధినేతలు ఉంటే.. ప్రభుత్వ స్కూళ్లను ఆకాశం ఎత్తున అభివృద్ధి చేసేస్తాం అంటే.. అది నమ్మదగ్గ విషయమా..? ప్రైవేట్ స్కూళ్లలో… విద్యార్థులు ముక్కు పిండి అధిక ఫీజులు వసూలు చేసే స్కూల్ యాజమాన్యాలు.. పాలక పక్షంలోనో, విపక్షంలోనో, పాలక పక్షానికి సపోర్టు గానో, విపక్షానికి మిత్ర పక్షంగానో ఉన్నప్పుడు.. ప్రభుత్వ స్కూళ్ల గురించి అది చేశాం, ఇది చేశాం అంటే..నమ్మేది ఎలా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అందరు ఒకే రీతిలో ఉంటారని కాదు కాని.. పరిస్థితులు ఈ చేదు నిజాలను తెలియజేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు మంచి చేయాలని కొందరు అధినేతలకు ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు కొరకరాని కొయ్యలా ఉంటే.. ఏ రీతిన ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తేగలరు. పులిని చూసి నక్క వాతో.. తమ బిడ్డలు తాము అనుభవించిన కష్టాలు అనుభవించకూడదనో..మరో కారణమో.. ఏదైనా.. ప్రైవేటు పాఠశాలలపైనే అందరూ దృష్టి సారిస్తున్నారు.
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సీట్లు అంటే…లాటరీ తగిలినంత గొప్ప అనే రీతిలో ఉండేవి. ఒక్క మాటలో చెప్పాలంటే … ఇప్పుడున్న కాస్ట్లీ సమాజంలోని యువత తల్లిదండ్రులు, తాతలు…అందరూ గవర్నమెంట్ స్కూళ్లల్లో చదివే…ఇప్పుడు పెద్ద పెద్ద పదవులు, కొలువుల్లో రాణిస్తున్నారు. తమను ఇంతలా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల్లో తమ బిడ్డలు, మనవలను చేర్చడానికి… ఈ పెద్దలు ఎందుకు ముందుకు రావడం లేదు. .ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు కనీస వసతులు నోచుకోక అల్లాడుతున్నాయి.
కావల్సిన మేరకు ఉపాధ్యాయులు ఉండరు, అడవుల్లా పెరిగిన తుప్పలు, విషప్పురుగులు సంచరిచే చోట స్కూళ్లు, హాస్టళ్లు.. తాగడానికి నీళ్లుండవు, కిటికీలకు తలుపులు ఉండవు, చెట్ల కింద చదువులు, వానొస్తే సెలవలు, దయనీయ హాస్టళ్లు, ఉడికీ ఉడకని అన్నం, పురుగుల మయమైన కూరలు, కాలుష్య వాతావరణంలో, కలుషిత ఆహారం, రోగాల పాలు.. ఈ భయంకర పరిస్థితుల్లో ఎవరు మాత్రం తమ పిల్లలను చేరుస్తారు. కూటికి నోచుకోని పేదలు సైతం తమ బిడ్డలను కార్పొరేట్ స్కూళ్లలో ఇందుకే చేరుస్తున్నారు. తమ బిడ్డల భవిత కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. తమ కష్టార్జితాన్ని కార్పొరేట్ స్కూళ్ల పరం చేస్తున్నారు. డ్రాపౌట్ లకు చెక్ పెట్టడానికి ప్రభుత్వ స్కూల్ టీచర్లు ఇంటింటికి తిరిగి.. ప్రభుత్వ స్కూల్ కు పిల్లలను పంపమని ప్రాధేయపడడాలు జరుగుతోంది.
ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా..? సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రైవేటు స్కూళ్లు.. ప్రభుత్వ పాఠశాలల కంటే ఏ విధంగాను గొప్పవి కావు. అయితే, ఈ సమాధానం అయితే చెప్పగలం కాని… ఆ మహోన్నత సర్కారు విద్యాలయాలు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని నిజాన్ని ఎలా దాచగలం. నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశం ఎత్తుకు తీసుకెళ్లిందని, రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని అన్నారు.
ఇదంతా ఎలా ఉన్నా.. అధికార పక్షం అనగానే.. ఠక్కున చేయాల్సిన పని విపక్షాల మీద విమర్శలు, గత ప్రభుత్వం ఈ నిర్వాకం చేసిందని చెప్పడమే కదా… ఎవళ్లు అధికార పక్షంలో ఉన్నా ఇదే విమర్శలు. ఎవరు విపక్షంలో ఉన్నా అధికార పక్షం పైనే ఫైటింగే. అయితే, సర్కారు బడుల విషయంలో హస్తం సర్కారు తీరు కొంత మెరుగే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను బలపరస్తున్నట్టు అధ్యాపకుల నియామకాలు తెలియజేస్తున్నాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన1,532 మందికి సీఎం నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి సీఎం అభినందనలు తెలిపారు. కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్దిపథం వైపు నడిపించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేలకు పైగా నియామకాలు చేపట్టామని చెప్పారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న చిక్కుముళ్లు విప్పుతూ సమస్యలు పరిష్కరించామని తెలిపారు. గతంలో సంతలో సరుకులా ప్రశ్నపత్రాలు అమ్మారని సీఎం విమర్శించారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లో ఉందని పెద్దలు చెప్పారని ఆయన అన్నారు. 30 వేల ప్రభుత్వ పాఠాశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 11 వేల ప్రైవేటు పాఠశాలల్లో 36.7 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు.
ప్రభుత్వ కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా..? ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు 25 వేల వరకు ఖర్చు అవుతుంటే, ప్రభుత్వ బడుల్లో లక్ష వరకు ఖర్చవుతోందని చెప్పారు. విద్యార్థుల భవితను విద్యాశాఖ తీర్చిదిద్దాలని కోరారు. గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందని, విద్యాశాఖను ప్రక్షాళనం చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. విద్యకు ప్రాధాన్యం ఇచ్చి 21, 650 కోట్ల రూపాయలు కేటాయించామని సీఎం వివరించారు. సీఎం వ్యాఖ్యలతో సర్కారు స్కూళ్లకు, ప్రభుత్వ కళాశాలలకు పూర్వవైభవం వస్తుందేమో అనే ఆశ కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.