మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా మరోసారి తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందిస్తూ.. జనాన్ని నట్టేట ముంచిందని ఆమె ఆరోపించారు. సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడానికి, భజన చేయడానికే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమయాన్ని వృథా చేశారని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకూ ఉపయోగపడదని రోజా ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఇంకా జగన్‌నే తిడుతూ సమయం వృథా చేస్తున్నారని అన్నారు. తనకు విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉందంటూ చంద్రబాబు అప్పులు చేస్తూ కూర్చున్నాడని దుయ్యబట్టారామె. జగన్ చాలా తక్కువ అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించారని అన్నారు.
అప్పులు చేసి మరీ రాజధాని అమరావతిని నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని.. అసలు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు రోజా. కూటమి ప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన అప్పులను తమ ఖాతాల్లోకి కూటమి నేతలు మళ్లించుకుంటున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని అన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ. 1500పై బడ్జెట్‌లో ప్రస్తావనే లేదని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి లేదు… ఉచిత బస్సు గురించి ఊసే లేదని విమర్శించారు. తల్లి వందనం పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు జరగలేదని.. అన్నదాతలను మోసం చేశారని విరుచుకుపడ్డారు.
డ్వాక్రా రుణాలు సున్నా వడ్డీకి ఇస్తామని మోసం చేశారని రోజా ఆరోపించారు. బడ్జెట్‌ను పాజిటివ్‌గా ప్రారంభించాల్సింది పోయి నెగిటివ్‌గా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారని అన్నారు. రూ. లక్ష కోట్ల అప్పులు చేశామని కూటమి ప్రభుత్వం చెబుతోందని.. అసలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని రోజా కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.