ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ వెల్లడించింది. పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతోనే మల్లన్నపై వేటు పడినట్టు తెలుస్తోంది
బీసీ కులగణన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ కులగణన నివేదికను కాల్చి వేశారు. దీనిపై క్రమశిక్షణా కమిటీ నోటీసులు పంపించింది. కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఆ నోటీసులను పట్టించుకోలేదు తీన్మార్ మల్లన్న. వివరణకు గడువు ఇచ్చినా స్పందించలేదు. దీంతో తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ నిబంధనలకు అత్యంత ప్రాధాన్యాత ఇచ్చే నాయకురాలిగా పేరు తెచ్చుకున్న మీనాక్షి నటరాజన్.. పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించబోమన్న సంకేతాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.
మహేశ్ కుమార్ గౌడ్ స్పందన
తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎవరైనా పార్టీ గీత దాటితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీసీ కులగణన నివేదికలను కాల్చివేయడం సరికాదని చెప్పారాయన. ఈ సందర్బంగా మల్లన్న చేసిన వ్యాఖ్యలు కూడా తప్పని అన్నారు. మల్లన్న ఎన్నో సార్లు హెచ్చరించినా వినలేదని చెప్పారాయన. మల్లన్నపై ఏఐసీసీ చాలా సీరియస్‌గా ఉందని అన్నారు మహేశ్‌కుమార్ గౌడ్