జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నివేదిక ప్రకారం మాదిగలకు రావల్సిన వాటా 11 శాతానికి బదులు 9 శాతం ఇచ్చారని అన్నారు. మాదిగల జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉండాలని.. మాలల జనాభా శాతం కంటే ఎక్కువగా వారికి రిజర్వేషన్ ఇచ్చారని చెప్పారు.
నివేదికలో ఉన్న లోపాలను ప్రభుత్వం వెంటనే సరిచేయాలని మందకృష్ణ కోరారు. ” నివేదికలో 15 కులాల వారికి వెనుకబాటు తనం ఆధారంగా ఒక్క శాతం రిజర్వేషన్ ఇచ్చారు. జనాభా ప్రకారం మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వని ప్రభుత్వం వెనుకబాటు తనం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలి. ఎస్సీ వర్గీకరణ నివేదికను స్వాగతిస్తున్నాం. ఏక సభ్య కమీషన్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నాం.
మాదిగలకు న్యాయం చేయడంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ భరోసా ఇవ్వలేక పోయాడు. మాదిగలకు న్యాయం చేయని దామోదర్ రాజనర్సింహను మంత్రి వర్గం నుంచి తప్పించాలి. మాదిగలకు వాటా తగ్గడంలో ఎమ్మేల్యే వివేక్ పాత్ర ఉంది. దామోదర్ రాజనర్సింహ కూడా మౌనంగా ఆమోదం తెలిపారు..అని మందకృష్ణ మాదిగ అన్నారు.
మాదిగల లక్ష డప్పుల దండోరా వాయిదా
MRPS తలపెట్టిన లక్ష డప్పులు వేయి గొంతకలు దండోరా వాయిదా పడింది. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో వాయిదా వేసినట్లు MRPS ప్రకటించింది. ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఆక్షేపించింది. త్వరలోనే దండోరా మరో తేదీని ప్రకటిస్తామని MRPS నాయకులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని MRPS ఆధ్వర్యంలో ఈ నెల 7న లక్ష డప్పులు… వేల గొంతుకలు కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఊరూరా తిరిగి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్లాన్ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో చివరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.