ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలా భద్రత, భరోసా వచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పెట్టుబడిదారులను ఆహ్వానించేలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనగాని మాట్లాడారు.
మంత్రి అనగాని మాట్లాడుతూ.. ఎవరి వల్ల మంచి జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. ఎప్పటినుంచో ఉన్న సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తున్నామని స్పష్టం చేశారు. సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా త్వరలోనే పరిష్కారం కాబోతోందని మంత్రి అనగాని అన్నారు. దాదాపు 500 ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,149 ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. గతంలో (2018-19)లో జీవో నెం.225 ఇచ్చామన్న మంత్రి… ఎంత భూమి ఆక్రమణకు గురైందో.. దానికి సమానంగా భూమి ఇచ్చేందుకు ఆనాడు నిర్ణయించారని అన్నారు. జీవో రాగానే కొంత మంది కోర్టుకు వెళ్లారని… గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేకపోయిందని చెప్పారు. సుమారు 12,149 కుటుంబాలకు న్యాయం చేయాలనే ఆలోచన కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేకపోయిందని విమర్శలు చేశారు.
సింహాచలం భూములను ఆక్రమించి 12,149 ఇళ్లను నిర్మించుకున్నారని… వాటి క్రమబద్ధీకరణకు గతంలోనూ ప్రయత్నాలు చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు 420 ఎకరాలకు బదులుగా 610 ఎకరాలు (సమాన రిజిస్ట్రేషన్ విలువతో) సింహాచలం దేవస్థానానికి బదలాయించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీని రిజిస్ట్రేషన్ విలువ రూ.5,300 కోట్ల వరకూ ఉందన్నారు. పెదగంట్యాడ, గాజువాక తదితర ప్రాంతాల్లో సింహాచలం దేవస్థానానికి 610 ఎకరాల భూమి ఇస్తున్నామని చెప్పారు. దేవస్థానానికి చందనం చెట్లను పెంచుకునేందుకు అవకాశం ఉన్న చోట భూమి ఇస్తున్నామన్నారు.
గాజువాకలో ఇనాం భూమిని క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకున్నామని..టీడీపీ హయాంలో ఇచ్చిన డీడ్‌ను గత ప్రభుత్వం పట్టించుకోలేదని అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పట్టాలు ఇచ్చి రెండేళ్లలోనే శాశ్వత హక్కులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ అంశంపై గురువారం కౌంటర్ దాఖలు చేయబోతున్నామని అనగాని స్పష్టం చేశారు. కోర్టులో తమకు సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నామన్న మంత్రి… తీసుకున్న భూమికంటే ఎక్కువ విలువ ఉండేలా.. అందరికీ వెసులుబాటు కలిగించేలా నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. రానున్న రెండు మూడు నెలల్లో పరిష్కార మార్గం లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.