22.2 C
Hyderabad
Thursday, January 9, 2025
spot_img

శీష్ మహల్ వ్యాఖ్య రచ్చ .. పీఎం, సీఎం నివాసాల వద్ద ఉద్రిక్తత

ప్రధాని నరేంద్ర మోడీ శీష్ మహల్ వ్యాఖ్య రచ్చ రాజేసింది. ఢిల్లీలోని సిక్స్ , ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బంగ్లాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసంగా మార్చారు. ప్రస్తుతం ఈ బంగ్లానే శీష్ మహల్‌ గా భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తోంది.

ఇటీవల ఢిల్లీలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఢిల్లీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ మాత్రం కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన భవనం నిర్మించుకోవడంలో బిజీగా గడిపారని దుయ్యబట్టారు. ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే, విలాసాల కోసం ప్రభుత్వ సొమ్మును మంచినీళ్లలా కేజ్రీవాల్ ఖర్చు పెట్టారని మండిపడ్డారు. అంతేకాదు ఢిల్లీలో దాదాపు పదేళ్లపాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగినప్పటికీ, అభివృద్దిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఢిల్లీ ప్రజలు ప్రస్తుతం మార్పు కోరుతున్నారన్నారు. భారత్ ఆకాంక్షలు నెరవేరాలంటే ఢిల్లీ అభివృద్ధి అత్యంత అవసరమన్నారాయన. భారతీయ జనతా పార్టీతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీలో ప్రస్తుతం ఆప్డా నహీ సహేంగే…బాదల్‌కే రహేంగే ….అనే నినాదం మాత్రమే వినిపిస్తోందన్నారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం కూడా చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ.

కాగా ప్రధాని నరేంద్ర మోడీ శీష్ మహల్ వ్యాఖ్య వివాదంగా మారింది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని నిర్మించుకున్నారన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు ఆప్ నేతలు. అంతేకాదు శీష్ మహల్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలోని అవాస్తవాలను బయటకు వెల్లడి చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రంగంలోని దిగారు. మీడియాను తీసుకుని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేజ్రీవాల్ ఉపయోగించిన ప్రభుత్వ బంగ్లా దగ్గరకు ఆప్ సీనియర్ నేతలు సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్ బయల్దేరారు. అయితే వీరి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో సంజయ్ సింగ్ పార్లమెంటు సభ్యుడు కాగా సౌరభ్ భరద్వాజ్ సాక్షాత్తూ ఢిల్లీ మంత్రి. దీంతో ఒక మంత్రి, ఎంపీని ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను ఈ ఇద్దరు నేతలు నిలదీశారు. దీంతో సదరు ముఖ్యమంత్రి నివాసం ఎదుట గందరగోళ వాతావరణం నెలకొంది.

కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోకి వెళ్లడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అటు వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సిక్స్ , ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బంగ్లాలోకి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసు చర్యకు నిరసనగా సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ కొద్దిసేపు అక్కడే ధర్నా చేపట్టారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసం ఉన్న లోక్‌కల్యాణ్ మార్గ్‌ వైపు వెళ్లారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి దగ్గరగా రాగానే ఈ ఇద్దరు ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడో ట్విస్ట్ ఉంది. కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని శీష్ మహల్ అంటూ బీజేపీ అభివర్ణిస్తే, ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసాన్ని రాజ్‌ మహల్ అంటూ విమర్శించింది ఆమ్ ఆద్మీ పార్టీ.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి లో జరగనున్న ఢిల్లీ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అరవింద్ కేజ్రీవాల్‌కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. హ్యాట్రిక్ కొట్టడానికి కేజ్రీవాల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కేంద్రంలో వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ, ఢిల్లీ అసెంబ్లీని మాత్రం కమలం పార్టీ దక్కించుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీ జైత్రయాత్రకు బ్రేకులు వేయాలని బీజేపీ గట్టిగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి మంత్రాన్ని ఆలపిస్తోంది. మద్యం కుంభకోణం ఎపిసోడ్‌ను ఎన్నికల ప్రచారంలో కీలకాంశం చేస్తోంది. ఇదిలాఉంటే ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం పోరాడుతోంది. అంతిమంగా ఆప్, బీజేపీ మధ్య నువ్వా , నేనా అనే స్థాయిలో ఎన్నికల పోరు నెలకొంది.

Latest Articles

తప్పు జరిగింది.. క్షమించండి- పవన్‌ కళ్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో తప్పు జరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్