సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైరయ్యారు. అదొక లొట్టపీసు కేసు…ఆయనో లొట్టపీసు ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టిన నాడు ఉన్న ఇబ్బంది కంటే ఇప్పుడేముందన్నారు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో త్రీడీ పాలన నడుస్తోందని విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.
జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సొరేన్ నిజాయితీ కలిగిన వారు కాబట్టి మహిళలకు రూ. 2,500 ఇస్తున్నారు. తెలంగాణలో 90 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తున్నామని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అంటున్నారు. కేసులు పెద్ద విషయం కాదు. రైతు భరోసాపై రేవంత్ రెడ్డి మోసాన్ని రైతులకు చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి రైతు భరోసా ఇవ్వలేదు. రుణమాఫీ కోసం దేవుళ్లపై రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అబద్దాలు చెప్పడం కూడా కుదరడం లేదు.
కేసు గురించి ఆందోళన అవసరం లేదు. బిఆర్ఎస్ పార్టీకి మంచి లీగల్ సెల్ ఉంది. రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీతో అబద్దాలు చెప్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి 8 నెలలు అయినా వారికి డబ్బులు ఇవ్వడం లేదు. భూకంపం వచ్చినా మేడిగడ్డ తట్టుకుని నిలబడింది. మేడిగడ్డకు పడ్డది పర్రె కాదు…రేవంత్ రెడ్డి పుర్రెకి. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహించాము. అందులో పైసా అవినీతి జరగలేదు.
ఈ సంవత్సరంలో కొత్త కమీటీలు ఏర్పాటు చేసుకోవాలి. జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందాము. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఇబ్బంది అనిపిస్తుంది అంట. ఉమ్మడి ఏపీలోనే బాగుంది అని రేవంత్ రెడ్డి అంటున్నారు. పోరాట నామ సంవత్సరంగా ముందుకు వెళ్ళాలి.. అని కేటీఆర్ బీఆర్ఎస్ నేతలకు సూచించారు.