పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే.. సుమోటోగా తీసుకుంటామని హెచ్చరించింది.
బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ముగ్గురిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలను ముగించిన హైకోర్టు తీర్పును వెలువరించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇచ్చింది.
అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌లు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీని ఫిరాయించినందుకు డిస్‌క్వాలిఫై చేయాలంటూ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చామని, ఇప్పటివరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని వారు పిటిషన్‌లో తెలిపారు. దీంతో ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. వేటు వేయాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది.