తెలంగాణలో ఇవాళ, రేపు 16వ ఆర్థిక సంఘం పర్యటించనుంది. చైర్మన్ అరవింద్ పనగరియా నేతృత్వంలోని బృందంలో అజయ్ నారాయణ్ ఝా, యానీ జార్జి మ్యాథ్యూ, మనోజ్ పాండా, డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ సభ్యులుగా ఉన్నారు. రేపు ప్రజాభవన్‌లో ఈ బృందం సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో భేటీ కానుంది. కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో ఆర్దిక సంఘాన్ని కోరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని కేంద్రానికి నివేదించాలంటూ ప్రభుత్వం కోరనుంది. వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచాలని విజ్ఞప్తి చేయనుంది. అదేవిధంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలని 16వ ఆర్థిక సంఘానికి నివేదించనుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఇవాళ ప్రజాభవన్‌లో పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు, గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనుంది 16వ ఆర్థిక సంఘ బృందం. ఆ తర్వాత వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు, సంస్థలతో పాటు రాజకీయ పార్టీ ప్రతినిధులతో విడివిడిగా సమావేశం కానుంది.