ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి ఢిల్లీ వెళ్లిన రేవంత్…. పార్టీ హైకమాండ్ నేతలను కలవనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతోపాటు సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి బృందం చర్చించనున్నారు. దీంతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై కూడా రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలలో చర్చించనున్నారని సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితోపాటు పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ కూడా ఢిల్లీలో ఉన్నారు. త్వరగా పార్టీ చీఫ్ ను రాష్ట్రంలో నియమిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సులువుగా ఉంటుందని సీఎం రేవంత్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ పదవిపై కొన్ని పేర్లను హైకమాండ్ పరిశీలనలో ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది. దీంతో పాటు మంత్రి వర్గ విస్తరణ గురించి కూడా ఒక క్లారిటీని పార్టీ పెద్దల నుంచి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.