ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కస్టడీని ఈనెల 31 వరకు పొడిగించగా.. సీబీఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఆగస్టు 8వ తేదీ వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి బవేజా గురువారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే సిసోడియా, కవితతో పాటు ఇతర నిందితుల జ్యుడీషియల్ కస్టడీని కూడా ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తిహాడ్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు.


