మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్‌లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్‌కి చెందిన బోడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్‌లపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్‌లు పదవీచ్యుతులు అయ్యారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉండగా, కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్ లపై అవి శ్వాసం ప్రకటించారు. దీంతో కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇరవై ఎనిమిది మంది కార్పోరేటర్‌లలో ఇరవై మంది కార్పోరే టర్లు సమావేశం లో పాల్గొని మేయర్, డిప్యూటీ మేయర్‌కు వ్యతిరేకంగా ఓటువేశారు. దీంతో బీఆర్‌ఎస్‌కు చెందిన మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్‌లు తమ పదవులు కోల్పోయారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తనయుడు తోటకూర అజయ్ యాదవ్‌ను తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది.