- దక్షిణాది రాష్ట్రాల మీద మోదీ గురి
- దక్షిణాది రాష్ట్రాల నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. చాలాకాలంగా బీజేపీ ఉత్తరాది పార్టీ అన్న ముద్రను ఎదుర్కొంటోంది. ఎప్పటికీ దక్షిణాదికి విస్తరించటం కష్టం అన్న విమర్శ ఉంది. ఇప్పటికే భారత్‌లో 75శాతం రాష్ట్రాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీ నియంత్రిస్తోంది. కానీ దక్షిణాది రాష్ట్రాలు మాత్రం కొరుకుడు పడటం లేదు.
ఈ ఏడాది జరగబోయే కర్నాటక ఎన్నికల్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కర్నాటకలో బీజేపీ జెండాను తిరిగి ఎగరేయాలని పట్టుదలగా ఉన్నారు అగ్రనేతలు. దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రంగా నిలుస్తోంది. చాలాచాలా ఒత్తిళ్లు, ఇబ్బందుల మధ్య కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. అటువంటి చోట ఇప్పుడు ఎదురు గాలి వీస్తోంది. సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటంతో వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీలో అంతర్గతంగా గ్రూపు తగాదాలు, బళ్లారిలో గాలి కుటుంబం తిరుగుబాటు వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఇటువంటి సమయంలో కర్నాటకను నిలబెట్టుకొనేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది.
కర్నాటకతో పాటు, ఈ ఏడాది తెలంగాణ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అందుచేత కర్నాటకలో మోదీ పోటీ చేస్తారన్న వార్త ఖరారైతే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుందని అంటున్నారు. అలాగే దక్షిణాదిన కూడా బీజేపీ పాగా వేయటానికి అవకాశం కలుగుతుందని చెబుతున్నారు.