ఎప్పుడొచ్చామన్నది కాదు.. టికెట్ కొట్టామా లేదా అన్నట్టున్నాయి పార్లమెంట్ ఎన్నికలు. లోక్‌సభ ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్‌ల డిమాండ్ మామూలుగా లేదు. ఇవాళ కండువా కప్పుకుంటే చాలు రేపే టికెట్ వచ్చి వాలుతుందన్నట్టు ఉంది వ్యవహారం. పార్టీ కోసం ఎన్ని రోజులు కష్టపడ్డామన్న లెక్క లేదు.. నిన్న మొన్న దుమ్మెత్తి పోశారే అన్న ఆక్రోశం లేదు. ఈ గట్టు నుంచి ఆ గట్టుకి చేరితే చాలు. కండువా మార్చెయ్, టికెట్ కొట్టెయ్ అన్నట్టున్నాయి తెలంగాణ రాజకీయాలు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరన్న మాట పొలిటికల్ వర్గాల్లో తరుచూ వినిపించే మాటే. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే అది నిజమేనంటూ ఏ మాత్రం డౌట్ లేకుండా ఒప్పుకోవాల్సిందే. నిన్నటి వరకూ నువ్వంటే నువ్వంటూ దుమ్మెత్తిపోసుకున్న నేతలే… కండువా మారగానే మనం మనం ఒక్కటే అన్నట్టు వ్యవహరిస్తూ… ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తుంటే ఇది చూస్తున్న ప్రజానీకమంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఇన్నాళ్లూ పార్టీనే నమ్ముకుని.. జెండాను భుజాన మోసిన బలగాన్ని కాదని.. వలస నేతలను అందలమెక్కిస్తుంటే కక్కలేక మింగలేక మల్లగుల్లాలు పడుతున్నారు సొంత గూటి నాయకులు.
పార్లమెంట్ ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు ప్రధాన పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ తీరుతో కాస్త అలకబూనితే చాలు.. పక్కా పార్టీ నేతలకు గాలమేసి లాక్కుంటున్నాయి. అందుకు టికెట్‌నే ఎరగా వేస్తున్నాయి. ముఖ్యంగా అధికారం పోయి నిస్తేజంలో ఉన్న గులాబీ నేతలకు టికెట్ ఆశ చూపి మొత్తం శిబిరాన్నే ఖాళీ చేయించారంటే రెండు జాతీయ పార్టీలు ఏ మేర వ్యూహాలు రచిస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది. అంతే కాదు వలస నేతలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల బరిలో వారికే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసిన నాయకులను సైతం పక్కన పెట్టేసి.. ఓవర్ నైట్ పార్టీ మారే నేతలకు ప్రీయారిటీ ఇస్తున్నారు. అందులో భాగంగానే చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ లకు టిక్కెట్లు కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీనీ వీడి, కాంగ్రెస్‌లో చేరిన వివేక్ వెంకట స్వామి కుమారుడు వంశీ కృష్ణకు పెద్దపల్లి టిక్కెట్ కేటాయించింది.
మరోవైపు బీజేపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థుల ప్రకటనకు ఒక్కరోజు ముందు పార్టీలో చేరిన బీబీ పాటిల్‌కు జహీరాబాద్ టికెట్ కేటాయింది. నాగర్ కర్నూల్ టిక్కెట్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్‌కు, నల్గొండ సైదిరెడ్డి, మహబూబాబాద్‌ను మాజీ ఎంపి సీతారాం నాయక్‌లకు అధిష్టానం కట్టబెట్టింది. ఇటీవల పార్టీలో చేరిన ఆరూరి రమేష్‌కు సైతం వరంగల్ టిక్కెట్ హామీ దక్కింది. వరంగల్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. ఆ రెండు స్థానాలను కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇప్పటి వరకు కాంగ్రెస్ 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో నలుగురు వలస నేతలే. బీజేపీ 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తే.. అందులో ఇటీవలే పార్టీలో చేరిన నలుగురికి టికెట్ కేటాయింది. ఇక కాంగ్రెస్ ప్రకటించని 8స్థానాల్లో ఇంకా ఎంత మంది ఇతర పార్టీలవారు ఉంటారో అన్న అసంతృప్తి ఆ పార్టీలో ఇప్పటికే వినిపిస్తోంది. గడ్డుకాల పరిస్థితిలోనూ మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని.. ఆ పార్టీ జెండానే వదలకుండా భుజాలపై మోసిన తమను కాదని.. జంపింగ్ జంపాన్‌లకే అధిక ప్రాముఖ్యతనిస్తుంటే అటు హస్తం శ్రేణులు, ఇటు కమలనాథులు జీర్ణంచుకోలేకపోతున్నారట. పదేళ్ల పాటు తమను ఇబ్బందులను గురి చేసిన వారే,.. సొంత పార్టీ ఎంపీ అభ్యర్థులు కావడంతో అధిష్టానం ముందు కక్కలేక మింగలేక మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లే టార్గెట్‌గా కాంగ్రెస్, బీజేపీలు వేస్తున్న ఈ ఎత్తుగడ ఎవరికి ఎంత మేర కలిసి వస్తుంది..? జంపింగ్ జపాంగ్‌ల వ్యూహంతో ఎవరికి ఎంత మేర లాభమవుతుందన్నది తెలియాలంటే.. ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.