స్వతంత్ర వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, భారత జీడీపీ క్యూ 4 గణాంకాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 77 పాయింట్ల నష్టంతో 62,544 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 18,517 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 25 పైసలు పుంజుకొని 82.47 దగ్గర ప్రారంభమైంది.
టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు, అపోలో హాస్పిటల్స్, హిండాల్కో, ఈచర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, దివిస్ ల్యాబ్స్ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోల్ ఇండియా, కోటక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ కార్ప్, బ్రిటానియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అటు అమెరికా రుణ పరిమితి పెంపు ఒప్పందానికి అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కొందరు సభ్యులు వ్యతిరేకించినప్పటికీ 314-117 ఓట్లో తేడాతో ఆమోదం లభించింది. ఇక జూన్ 5 లోపు ఈ బిల్లుకు సెనేట్ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అప్పుడు అమెరికా అప్పుల గండం నుంచి బయటపడుతుంది.అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. అప్పుల పరిమితి బిల్లు ఓటింగ్ నేపథ్యంలో అక్కడి మార్కెట్లు అప్రమత్తంగా వ్యవహరించాయి. మరోవైపు బలమైన ఉద్యోగ గణాంకాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. వడ్డీరేట్ల పెంపు కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడ్డాయి. కాగా, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం బుధవారం రూ. 82.72 వద్ద క్లోజ్ అయింది. ఇక గురువారం ఉదయం 25 పైసలు పుంజుకొని 82.47 దగ్గర ప్రారంభమైంది.
మరోవైపు చైనాలో మే నెలలో తయారీ కార్యకలాపాలు 11 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి వృద్ధిని సాధించింది. 2022-23 జనవరి-మార్చి త్రైమాసికంలో 6.1% వృద్ధి చెందడంతో, పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.2 శాతానికి చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు బుధవారం రూ.3,406 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,529 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.