స్వతంత్ర వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పుష్ప టీమ్ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. నేడు తెల్లవారుజామున పుష్ప 2 సినిమాలో నటించిన పలువురు ఆర్టిస్టులు షూటింగ్ ముగించుకున్న అనంతరం ఓ ప్రైవేట్ బస్సులో హైదరాబాద్‌కి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై నార్కట్‌పల్లి శివార్లలో ఆగి ఉన్న ఓ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఆర్టిస్టుల ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు భాగాలు డ్యామేజ్ అయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పలువురికి స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. గాయాలు అయిన ఆర్టిస్టులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అయితే ఎవరీ ప్రాణాన్నికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
ఈ రోడ్డు ప్రమాదంతో హైవేపై కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ నెలకొంది. విషయం తెలుసుకొని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి విచారిస్తున్నారు. పుష్ప 2 ఆర్టిస్టులు ఉన్న బస్సుకి యాక్సిడెంట్ అవ్వడం, ఇద్దరికి గాయాలు అవ్వడంతో పుష్ప చిత్రయూనిట్ కంగారు పడుతున్నారు. ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ యాక్సిడెంట్ పై మరింత సమాచారం రావాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం పలు అడవుల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు.