స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: జాతీయస్థాయిలో మెడిసన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు మొదలైన పరీక్ష సాయంత్రం 5.20గంటల వరకు కొనసాగింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 18.72లక్షల మంది హాజరయ్యారు. దేశంలోని 499 నగరాలు, పట్టణాలతో సహా విదేశాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు అధికారులు. ఏపీ నుంచి 68,022.. తెలంగాణ నుంచి 70వేల మంది వరకు నీట్ పరీక్షకు హాజరయ్యారు.
పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లే ముందు విద్యార్థులను నిశితంగా తనిఖీలు చేశారు. చెవి కమ్మలు, ముక్కు పుడకలు, ఉంగరాలు, ఇతర ఆభరణాలు ధరించిన వారి నుంచి ఆ వస్తువులను తీసివేయించారు. అయితే అధికారుల రూల్స్ పై తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఇవేమీ రూల్స్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా మణిపూర్ లో హింసాత్మక వాతావరణం నేపథ్యంలో అక్కడి విద్యార్థులకు కొన్నిరోజుల తర్వాత నీట్ పరీక్ష నిర్వహించనున్నారు.