BRS State Representative Meeting | బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశ పెట్టారు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతిరాష్ట్రంలో ఒక భారీ నీటి ప్రాజెక్టు నిర్మాణం, దేశవ్యాప్తంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా, మన దేశ బ్రాండ్‌తో విదేశాలకు ఫుడ్ ప్రొడక్టుల ఎగుమతి, దేశవ్యాప్తంగా దళితబంధు, దేశంలో భారీ స్థాయిలో మౌలిక వసతులు,దేశంలో బీసి జనగణన, దేశంలో ద్వేషాన్ని విడిచి ప్రశాంతతకు దేశ పౌరులంతా ఏకం కావాలని, దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఅరెస్ ప్రణాళికలు, పనిచేయాలని తీర్మానించారు. దేశవ్యాప్తంగా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని అన్నారు.
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందానికి సూచించారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గాల వారీగా ఇద్దరు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. దాహం వేసినప్పుడే బావి తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదన్నారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం.. లాంటివి చేయాలని సూచించారు. భారాస అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదని.. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడమే మనకు ప్రధానమైనదని అన్నారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ను కూడా నడపవచ్చునని సూచించారు.
పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట జెడ్పీ చైర్మన్లు, ఎంపీలు ఇంఛార్జిలుగా నియామకం చేయాలన్నారు. మూడు, నాలుగు నెలల్లో ఇంఛార్జీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇక నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు. జాగ్రత్తగా లేకుంటే మీకే ఇబ్బంది, నేను చేసేదేం లేదని వ్యాఖ్యానించారు. బాగా పనిచేసినవారికే టికెట్లు ఇస్తామన్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. కేడర్‌లో అసంతృప్తిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.