స్వతంత్ర వెబ్ డెస్క్: వనపర్తి జిల్లాలోని అమరచింత కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. గురువారం రాత్రి భోజనం వికటించి 70 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. సాంబారు, వంకాయ కూరతో భోజనం చేసిన వారంతా అర్ధరాత్రి నుంచి కడుపులో మంట, వాంతులకు గురయ్యారు. విద్యాలయంలో ఒక్కరే టీచర్ ఉండటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లలేదు. ఉదయం పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 40 మంది విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.


