షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడం(AC Blast)తో ఓ తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కర్ణాటకలోని రాయచూరు తాలూకాలోని శక్తి నగర్ కేపీసీఎల్ కాలనీలో వెలుగు చూసింది. ఈ హృదయ విదారక ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మృతులను రంజిత (33), పిల్లలు మృదుల (13), తరుణ్య (5)గా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాండ్య వాసియైన సిద్దలింగయ్య స్వామి భార్యాపిల్లలతో కలిసి కేపీసీఎల్ కాలనీలో స్థానికంగా నివాసం ఉంటున్నాడు. సిద్దలింగయ్య స్వామి శక్తినగర్ థర్మల్ కేంద్రంలో ఏఈగా పనిచేస్తున్నారు. ఏమైందో ఏమో కానీ విధి వక్రీకరించడం వల్ల సోమవారం షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికక్కడే సిద్దలింగయ్య భార్య, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఏసీలో పేలుడు సంభవించినందువల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టినట్లు రాయచూరు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు.