తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కౌంటర్ల దగ్గర జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు. స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వారికి అందుతున్న చికిత్సపై వైద్యులతో మాట్లాడారు.
తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత చెప్పారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది ప్రమాదమా..? కుట్రా..? అనే కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు. ఎవరి వైఫల్యమో సీసీ కెమెరాల ద్వారా గుర్తిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వైకుంఠ ఏకాదశికి ముందు ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఘటనకు కారణం తొందరపాటు చర్యా? సమన్వయా లోపమా? అనేది విచారణలో వెల్లడవుతుందని చెప్పారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపిస్తున్నామని తెలిపారు. అంత్యక్రియలకు తగిన సాయం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూ మంత్రి అనగాని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.