వికసిత్ భారత్ తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్ సభలో మాట్లాడారు. ఐదేళ్లలో 12 కోట్ల మందికి మంచినీటి వసతి కల్పించామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. కొంత మంది నేతలు పేదలతో ఫోటో సెషన్ చేస్తున్నారని అన్నారు. వారు పార్లమెంటులో పేదలపై చర్చల్లో మాత్రం పాల్గొనరని ఆరోపించారు. తాము బూకటపు హామీలను ఇవ్వలేదన్నారు.
“స్వచ్ఛ్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. చెత్త నుంచి సంపదను సృష్టిస్తున్నాం. డిజిటల్ లావాదేవీలతో పారదర్శకత తీసుకొచ్చాం. ఇథనాల్ బ్లెండింగ్‌తో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చాం. ఆయుష్మాన్ భారత్ పథకంతో పేదలకు రూ.1.20 లక్షల కోట్లు ఆదా”.. ప్రధాని అన్నారు.
ఆదాయపు పన్ను తగ్గించి మధ్యతరగతి ప్రజలను ఆదుకున్నాం. రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను రాయితీ ఇచ్చాం. పేద, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాం. ఐదేళ్లలో 12 కోట్ల మందికి తాగునీటి వసతి కల్పించాం. 4 కోట్ల మంది పేదలకు గృహ వసతి కల్పించాం.
రాజ్యాంగం అంటే మాకు ప్రాణం. రాజ్యాంగ విలువలను ప్రతిక్షణం గౌరవిస్తాం. కొన్ని పార్టీలు యువతను మోసం చేస్తున్నాయి. ఎన్నికల వేళ యువతకు ఎన్నో హామీలు ఇస్తున్నారు. డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. యువతకు వాళ్లు ఆపదగా మారారు. కానీ బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. అందుకే హర్యానాలో మూడోసారి విజయం సాధించాం. మహారాష్ట్రలో ఘన విజయం సాధించాం… అని ప్రధాని మోదీ అన్నారు.