ఆసియాలో అతిపెద్ద వైమానిక ప్రదర్శన బెంగళూరులో ప్రారంభం
14th Aero India 2023 Air Show in Bangalore: బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో 35వేల చదరపు కిలోమీటర్లలో ‘ఏరో ఇండియా షో’ ప్రదర్శన వేదిక ఏర్పాటు చేశారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షోగా అభివర్ణిస్తున్నారు.
ఏరో ఇండియా ప్రదర్శన భారత శక్తిని ప్రపంచానికి తెలియజేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విదేశాలకు రక్షణ రంగ సామగ్రి ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిందని తెలిపారు. కర్ణాటకలో ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం భారత వైమానిక దళం ప్రదర్శించిన విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు.
ఏరో ఇండియా ప్రదర్శన…భారత్ కొత్త బలం, సామర్థ్యాలకు వేదికని ప్రధాని అన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ పరికరాల దిగుమతి దేశంగా ఉన్న భారత్, ఇప్పుడు ప్రపంచంలోని 75 దేశాలకు ఎగుమతి చేసే స్థితికి చేరిందన్నారు. అందుకే పారిశ్రామిక వేత్తలు రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నానని తెలిపారు. ఈరోజున 100 దేశాలు ఇక్కడ పాల్గొన్నాయంటే భారత్ పై ప్రపంచానికి ఎంత గురి ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు.
అందుకే బడ్జెట్ లో రక్షణ రంగానికి కేటాయింపులు ఎక్కువ చేశామని తెలిపారు. రక్షణ రంగ వస్తువుల తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేశామని అన్నారు. రక్షణ రంగంలో భారతదేశం బలోపేతమైందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తక్కువ ఖర్చుతోనే రక్షణ రంగ పరికరాలను తయారుచేసుకుంటున్నామని వివరించారు.
‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ పేరుతో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఏరో ఇండియా షో ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా ప్రధాని పేర్కొన్నారు. ‘భారత్ లో తయారీ- ప్రపంచం కోసం తయారీ’ అనే నినాదంతో లక్ష్యంతో రూపొందిన భారతీయ రక్షణ రంగ ఉత్తత్పులు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయని రక్షణ శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ 17వరకు నిర్వహించే కార్యక్రమంలో సుమారు 75వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకోవడానికి వీలుందని తెలిపారు. 32 దేశాల నుంచి రక్షణ మంత్రులు, 73 మంది వివిధ సీఈవోలు హాజరవుతున్నట్టు తెలిపారు.