తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు స్థానికులకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఇక నుంచి వంద శాతం ఇంజినీరింగ్ సీట్లు రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు మాత్రమే ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ముగియడంతో తాజాగా కొత్త జీఓ విడుదల చేసింది ప్రభుత్వం. వరుసగా 9 తరగతి 10, ఇంటర్ వరకు లేదా 6 నుంచి ఇంటర్ వరకు ఎక్కువ ఎక్కడ చదివితే దాన్ని బట్టి స్థానికతగా పరిగణనలోకి తీసుకునే వారు. తాజా జీఓ తో తెలంగాణ విద్యార్థులే ఇంజనీరింగ్ సీట్లు పొందే అవకాశం కల్పించింది ప్రభుత్వం.
జీవో ప్రకారం.. 2025- 26 కన్వీనర్ కోటా బీటెక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి. ఇప్పటి వరకు కొనసాగిన 15 శాతం అన్ రిజర్వ్‌డ్ అంటే నాన్ లోకల్ కోటా రద్దయింది. ఇప్పటి వరకు ఇంజినీరింగ్ 70 శాతం కన్వీనర్ కోటా.. 30 శాతం యాజమాన్యం కోటా కింద భర్తీ చేసేవారు. కన్వీనర్ కోటాలోని సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులకే కేటాయించేవారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడే అవకాశం ఉండేది.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినందున స్థానికత, స్థానికేతర కోటా తదితర అంశాలపై అధ్యయనం చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆ నివేదికలో కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించాలని, అందులో 95 శాతం రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 5 శాతం వివిధ అవసరాలమేరకు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఇవ్వాలని ప్రధానంగా సిఫార్సు చేసింది.