చూడటానికి కుర్రాడే…కానీ పిట్ట కొంచెం కూత ఘనం…ఎవడ్నీ లెక్క చేయడు. చూస్తే చిన్న దేశం…కానీ అన్ని ఆయుధాలని తయారుచేస్తుంటాడు. ఎక్కడో ఉన్న అమెరికాకు గురి పెడుతుంటాడు. వాళ్లు అక్కడ కంగారు పడుతుంటారు. ఇక్కడ కిమ్…నవ్వుతూ ఉంటాడు. అలా అందరినీ గిల్లి…వినోదం చూడటం, అతనికొక ఆనందం. అయితే అందరూ ఎందుకు భయపడతారంటే వాడికసలే తిక్కుంది. ఎందుకొచ్చిన గొడవ అన్నంతపనీ చేస్తాడని అగ్రరాజ్యం అమెరికాలాంటిదే భయపడటం కొసమెరుపు.
ప్రపంచ దేశాల నడుమ ఉత్తర కొరియా రూటే సెపరేటు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు తనదైన స్టయిల్ లో సవాల్ విసురుతుండటం కమ్యూనిస్టు కొరియాకు అందునా కిమ్ కు భలే అలవాటు. తాజాగా కొత్త సంవత్సర శుభాకాంక్షల్ని వెరైటీగా అందించారు. తూర్పు జలాల్లోకి బాలిస్టిక్ మిస్సైల్ ను పంపించి ఉత్తర కొరియా పరీక్షించింది. మిస్సైల్ ప్రయోగం తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. ఈ మేరకు ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్ కొన్ని ఫోటోలు విడుదల చేశారు.
అలాగే కొత్త సంవత్సరం సందర్భంగా కిమ్ జోంగ్ అధికార పార్టీ అగ్ర స్థాయి సమావేశం నిర్వహించారు. దేశీయంగా పరిపాలనను పర్యవేక్షించటంతో పాటు ఆయుధ పటిమను సమీక్షించారు. రానున్న కాలంలో అణు ఆయుధాల తయారీ ని మరింతగా పెంచుతామని శపథం చేశారు. శక్తివంతమైన ఖండాంతర క్షిపణుల్ని సైతం తయారు చేసుకొంటామని తెలిపారు.
ఉత్తర కొరియాను ఇబ్బంది పెట్టాలి అనుకొనే దేశాల్ని దెబ్బ తీసేందుకు ఏమాత్రం వెనుకాడబోమని తెగేసి చెప్పారు. ఇదంతా అమెరికా, బ్రిటన్ వంటి అగ్ర దేశాలకు హెచ్చరిక అన్న సంగతి స్పష్టంగా అర్థం అవుతోంది.
మొత్తానికి అప్పుడప్పుడు ప్రజల ముందుకు వచ్చే కిమ్ జోంగ్… వచ్చినప్పుడల్లా అమెరికాకు చురకలు అంటిస్తుంటారు. తాజాగా కూడా అమెరికా దేశాలను లక్ష్యంగా చేసుకొనే కామెంట్స్ విసిరారు.