ఏపీలో అధికార పక్షమైన వైసీపీ 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల్ని నియమించడంతో పాటు ‘సిద్ధం’ పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఇవాళ ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తర కోస్తాలోని 50 నియోజకవర్గాల నుంచి భారీగా శ్రేణులు, అభిమానులు తరలిరానున్నారు. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది. 110 ఎకరాల సభా ప్రాంగణం, ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారు.