అమెరికాలోని అయోవా రాష్ట్రం డాలస్ కౌంటీకి చెందిన పెరి పట్టణంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఆరో గ్రేడ్ చదువుతున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో నలుగురు విద్యార్థులతో పాటు పాఠశాల నిర్వాహకుడు ఉన్నట్లు చెప్పారు. కాల్పులకు తెగబడ్డ విద్యార్థి డేలీన్ బట్లర్ మృతదేహాన్ని సైతం గుర్తించామన్నారు. అతని శరీరంలో బుల్లెట్ గాయాలు ఉన్నాయని.. బహుశా తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడనేది మాత్రం తెలియరాలేదు. బట్లర్ చాలా నిశ్శబ్దంగా ఉండేవాడని.. చాలా ఏళ్లుగా వేధింపులకు గురవుతున్నాడని అతని తల్లి, ఇద్దరు స్నేహితులు తెలిపారు. వాటితో అతను విసిగిపోయాడని సోదరి యెసినియా రోడర్ హాల్ చెప్పారు. అందువల్లే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.