ముంబయిలో నూతనంగా నిర్మించిన అటల్ సేతుపై తొలి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయా ణిస్తున్న ఇద్దరు మహిళలు సహా చిన్నారులు గాయపడ్డారు. ముంబయి నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని చిర్లేకు వెళుతున్న కారు అటల్ సేతుపైకి చేరుకోగానే.. ముందు వెళుతున్న మరో వాహనాన్ని దాటేందుకు యత్నించింది. దీంతో అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం తీవ్రత మరింత ఎక్కు వగా ఉంటే వాహనం సముద్రంలో పడేదని అక్కడి వారు తెలిపారు. ఈ ఘటన మొత్తం వంతెనపై వెళుతున్న మరో కారు డ్యాష్‌కామ్‌లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అటల్ సేతు ప్రారంభించిన తర్వాత ఇదే తొలి ప్రమాదమని అధికారులు తెలిపారు. గాయపడిన మహిళలు, చిన్నారులను ముంబయి ట్రాఫిక్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు.