28.2 C
Hyderabad
Saturday, March 2, 2024
spot_img

విశాఖ ఈస్ట్‌లో వైసీపీ పాగా సాధ్యమేనా ?

       అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులతో తలబొప్పి కడుతున్న వైసీపీకి… విశాఖ తూర్పు నియోజకవర్గం మరింత తలనొప్పిగా మారిందా అంటే అవునన్న వాదన బలంగా వినిపిస్తోంది. విశాఖపట్టణం సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మొదట్లో ఈ నియోజకవర్గంపై పట్టు సాధించేలా కన్పించినా.. ఇప్పుడు మాత్రం వైసీపీ నేతలకే ఆయన ప్రవర్తన అంతగా రుచించడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో.. కేడర్ ఒక్కొక్కరుగా చాపకింద నీరులా సైడైపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఎంవీవీకి విశాఖ ఈస్ట్‌లో ఝలక్ తప్పదన్న అభిప్రాయం బలంగా విన్పిస్తోంది.

        విశాఖపట్టణం… ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. దేశంలోనే ఈ నగరానికి ఎంతో పేరు ఉంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాను గాలి ఎంత బలంగా వీచినా హేమాహేమీల్లాంటి నేతల్ని జగన్ పార్టీ ఓడించినా, విశాఖలో మాత్రం వైసీపీ ఆటలు సాగలేదు. ఎంపీ సీటు నెగ్గినా అసెంబ్లీ స్థానాల విషయంలో మాత్రం పైచేయి టీడీపీదే అయింది. దీంతో నాటి నుంచి ఆపరేషన్ విశాఖ మొదలుపెట్టింది వైసీపీ. ఇక, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో విశాఖను పరిపాలనా రాజధాని చేసి ఆ ప్రాంతంపై నేరుగా సీఎం జగనే ఫోకస్ పెట్టారు. అయితే.. ఓవైపు కోర్టు కేసులు నడుస్తున్నా త్వరలోనే విశాఖ నుంచి ముఖ్యమంత్రి పరిపాలన మొదలు పెడతారంటూ ఎన్నో మార్లు ప్రచారం జరిగినా అదేదీ కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి సమయంలోనే మరోసారి ఎన్నికలు వచ్చేశాయి. దీంతో… 2024 ఎన్నికలకు వ్యూహాత్మకంగా పావులు కదపడం మొదలు పెట్టింది వైసీపీ. కానీ, అవేనీ అంత సత్ఫలితాలు ఇస్తున్నట్లు కన్పించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య విశాఖ ఎంపీగా ఈసారి తాను పోటీ చేయబోనని.. ఎమ్మెల్యేగా మాత్రమే బరిలో దిగుతానని అధిష్టానంతో మాట్లాడి అనుమతి పొందారు సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. దీంతో…విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించిన సీఎం వైఎస్ జగన్.. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు చెక్ పెట్టాలని వ్యూహం రచించారు. దీంతో.. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడప కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంవీవీతోపాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సర్కారు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రచారాన్ని హోరెత్తించారు. దీంతో.. అంతా బాగానే ఉంది.. ఈసారి విశాఖలో వైసీపీ జెండా మరింత గట్టిగా ఎగురుతుందని అంతా భావిస్తున్న తరుణంలో మళ్లీ పరిస్తితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్న వాదన వినిపిస్తోంది.

సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న సత్యనారాయణ అసెంబ్లీకి పోటీ చేస్తున్నా కార్యకర్తలను, స్థానిక నేతలను కలుపుకొని పోవడంలో మాత్రం వెనుకబడ్డారన్న విమర్శలున్నాయి. ఇక, ఆయన వ్యవహార శైలి సైతం సరిగా లేదంటున్నాయి పార్టీ శ్రేణులు. దీంతో… కేడర్ ఒక్కొక్కరుగా ఫ్యాను కింద నుంచి జంపయ్యే పరిస్థితులు వస్తున్నాయని గుసగుసలాడుకుం టున్నారు. వీటికితోడు ఎన్నికల వేళ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌తో ఎంవీవీకి విబేధాలు తలెత్తాయి. వాటని పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిగినా అవి సత్ఫలితాలు ఇవ్వలేదు. వాస్తవానికి నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా ఈ సమస్య ఓ కొలిక్కి రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక…ఎంవీవీని విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓడించడమే లక్ష్యమని శపథం చేస్తూ వైసీపీని వీడారు వంశీకృష్ణ. అక్కడితో ఆగని ఆయన.. నేరుగా వెళ్లి జనసేనాని పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో.. వంశీ వెళ్లిపోవడం పార్టీకి పెద్ద మైనస్ అన్న వాదన గట్టిగా విన్పిస్తోంది.

వాస్తవానికి విశాఖలో టీడీపీ బలంగా ఉంది. ప్రత్యేకించి తూర్పు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు గత మూడుసార్లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రత్యేకించి వైసీపీ గాలి ఎంతో బలంగా వీచిన 2019లోనూ ఆయనే గెలుపొందారు. ఇలాంటి వేళ వెలగపూడిని ఢీకొట్టాలంటే వైసీపీ సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది. కానీ, జరుగుతున్న పరిణామాలు మాత్రం ఫ్యాను పార్టీకి ఏమాత్రం రుచించడం లేదన్న వాదన విన్పిస్తోంది. ఎన్నికల వేళ ఇప్పటికే వివిధ రకాల సర్వే రిపోర్ట్‌లు తెప్పించుకున్న తాడేపల్లి పెద్దల వద్దకు ఎంవీవీ జాతకం కూడా చేరిందని.. ఎక్కువగా నెగెటివ్ మార్కులే పడ్డాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో… త్వరలోనే ప్రకటించనున్న ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పుల్లో ఎంవీవీకి చెక్‌ పెట్టవచ్చన్న వాదన విన్పిస్తోంది.

      ఎంవీవీకి చెక్ పెడితే ఆయన స్థానంలో ఎవరు అంటే.. అక్కరమాని విజయలక్ష్మి పేరు విన్పిస్తోంది. టీడీపీ బలంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో 15 కార్పొరేటర్ సీట్లు ఉండగా.. 11 స్థానాలు అక్కరమాని నాయకత్వంలో గెలుచుకుంది వైసీపీ. పైగా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు తెలుగుదేశం పార్టీ కన్నా 15 వేల మేర ఎక్కువ కావడంతో అక్కరమాని పేరు గట్టిగా విన్పిస్తోంది. ఇప్పటికే బీసీ సాధికార బస్సు యాత్ర ఎంవీవీ నాయకత్వంలో చెప్పుకోదగిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో పార్టీ నాయకత్వం అక్కరమాని వైపు చూస్తోందన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. మరి.. రానున్న రోజుల్లో విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్‌ మార్పు జరుగుతుందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే.. వైసీపీ నాయకత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే మరోసారి విశాఖ తూర్పులో వెలగపూడిని అడ్డుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే విన్పిస్తోంది.

Latest Articles

పాలమూరు – రంగారెడ్డిపై కాంగ్రెస్ ఆరోపణలు

   దక్షిణ తెలంగాణ వరదాయనిగా పేరొందిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కరువుసీమగా పేరున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటిని పారించే ప్రధాన లక్ష్యంతో ప్రారంభించిన పాలమూరు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్