ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రదేశమైన సంగం వద్ద 50 లక్షల మందికి పైగా ప్రజలు మొదటి పవిత్ర స్నానం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా భావించే ఈ మహా కుంభమేళాకు 40 కోట్ల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఇది అమెరికా, రష్యా జనాభా కంటే ఎక్కువ.
12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమం సుమారు 4,000 హెక్టార్లలో ఏర్పాటు చేయబడింది. ఫిబ్రవరి 26 వరకు కుంభ మేళా కొనసాగుతుంది. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఇది భారీ ప్రోత్సాహాన్నిఅందిస్తుందని అంచనా వేస్తున్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం రూ.7,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
రూ. 2 లక్షల కోట్ల వరకు ఆదాయం
ఈ మహా కుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్‌కు రూ. 2 లక్షల కోట్ల వరకు ఆర్థిక వృద్ధి లభిస్తుందని అంచనా. 40 కోట్ల మంది సందర్శకులు సగటున ఒక్కొక్కరు రూ. 5,000 ఖర్చు చేస్తే రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వార్తా సంస్థ IANS అంచనా ప్రకారం.. ఒక వ్యక్తి సగటున రూ. 10వేల వరకు ఖర్చు పెరగవచ్చని.. అలా ఖర్చు చేస్తే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుకోవచ్చని పేర్కొంది. ఇది నామమాత్ర, వాస్తవ జిడిపిని 1 శాతానికి పైగా పెంచుతుందని అంచనా.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. 2019లో జరిగిన ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల రూపాయలను అందించిందని అన్నారు. 2019లో జరిగిన సగం కుంభమేళాకు దాదాపు 24 కోట్ల మంది యాత్రికులు వచ్చారని చెప్పారు.
ఈ ఏడాది 40 కోట్ల మంది భక్తులు వస్తారనుకుంటే.. మహా కుంభానికి రూ. 2 లక్షల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు యోగి ఆదిత్యానాథ్ ఇటీవల ఒక న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం.. ప్యాకేజ్డ్ ఫుడ్స్, వాటర్, బిస్కెట్లు, జ్యూస్‌లు, మీల్స్‌తో సహా ఫుడ్ అండ్ బేవరేజ్ సెక్టార్‌కి రూ. 20వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.