గులాబీ బాస్ కేసీఆర్ తిరిగి యాక్టివ్ అవుతున్నారా…? అందుకే పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారా…? బిఆర్ఎస్ అధినేత నేతలు, కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు…? ఇంతకు పార్టీ బలోపేతం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు…? కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చినట్లేనా…? గులాబీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది…?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చాలాకాలం సైలెంట్ గా ఉన్నారు. తన ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. పొలిటికల్ గా కేసీఆర్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఇటీవల కేసీఆర్ తాను తిరిగి యాక్టివ్ అవుతున్నాను అనే సిగ్నల్ ఇస్తున్నారు. అందులో భాగంగానే ఫామ్ హౌస్ కు వచ్చిన లీడర్లను కలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తంవడంతో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాను. నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని ఇటీవల కేసీఆర్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి… అని కేసీఆర్ ఇటీవల కామెంట్స్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా అని కేసీఆర్ అన్నారు.
ఇక ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభతో రీఎంట్రీ ఇవ్వాలని గులాబీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. గజ్వేల్ లేదా సిద్దిపేటలో భారీ బహిరంగ సభ పెట్టాలని ప్లాన్ చేశారు.కానీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ప్రస్తుతం బహిరంగ సభను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ మీటింగ్ కు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పోరేషన్ చైర్మన్లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీతో బిఆర్ఎస్ పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. 25 సంవత్సరాల గులాబీ పార్టీ ప్రస్థానంపై స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు.
గులాబీ పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ లో పార్టీ బలోపేతంపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ అధికారం కోల్పోయి సంవత్సరం పూర్తయినా ఇప్పటి వరకు పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి సారించలేదు. ఈ నెల 19వ తేదీన జరిగే మీటింగ్ లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందో కేసీఆర్ ప్రకటిస్తారు. దీంతో పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పై క్లారిటీ ఇవ్వనున్నారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలను భర్తీ చేసే అంశంపై గులాబీ బాస్ కేసీఆర్ క్లారిటీ ఇస్తారు. పార్టీ కమిటీలు పూర్తయిన తర్వాత నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను ఏర్పాటు చేసే విధంగా కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో పార్టీ ప్రతినిధుల సభను ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుడిని గులాబీ నేతలు ఎన్నుకోనున్నారు. ఇక బహిరంగ సభ పార్టీ ఆవిర్భావం జరిగి సిల్వర్ జూబ్లీ అవుతున్న సందర్భంగా నిర్వహించాలా లేక ప్రతినిధుల సభ ఏర్పాటు సమయంలో బహిరంగ సభ నిర్వహించాలా అనే దానిపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు.
చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తుండటంతో విస్తృతస్థాయి సమావేశంలో ఏం మాట్లాడతారనే చర్చ గులాబీ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక కేసీఆర్ అసెంబ్లీకి రావలంటూ గత కొంత కాలంగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజల్లోకి రావాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. అయినప్పటికీ కేసీఆర్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రెస్పాండ్ కావడం లేదు. అసెంబ్లీకి రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా పరోక్షంగా బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నేరుగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. దీంతో విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు అంతా పాల్గొంటారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా తమ అధినేత ఎలాంటి కామెంట్స్ చేస్తారు అనే దానిపై గులాబీ నేతల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఇతర అంశాలు రైతు రుణమాఫీ, రైతు భరోసాపై సర్కారు వైఫల్యాలను బిఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది.
బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేసీఆర్ ఎలాంటి కామెంట్స్ చేస్తారు. తిరిగి ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వస్తారు. అసెంబ్లీకి వస్తారా లేదా అనే దానిపై క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.