మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారట. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన హజరయ్యేది కేవలం సోమవారం మాత్రమే. జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారట. ఆరోజు ఎలాగూ సభా కార్యకలాపాలు సాగవు కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు. అయితే మంగళవారం నుంచి శాసనసభకు హాజరుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదట. శాసనసభకు, బడ్జెట్ సమావేశాలకు రావడంపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే జగన్ తరచూ బెంగళూరులో గడుపుతుండడంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంటుంది. జగన్ ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు బెంగళూరు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఇప్పుడు కూడా రెండు పర్యటనలు ముగిశాయో లేదో ఇలా బెంగళూరు వెళ్లిపోయారు. విజయవాడలో జైల్లో ఉన్న వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఆ వెంటనే మరుసటి రోజు గుంటూరు మిర్చియార్డును సందర్శించారు. రైతుల కష్టాలను తెలుసుకున్నారు. ఇక తమ నాయకుడు ప్రజల్లోనే ఉంటారని, ప్రజల సమస్యలు వింటారని పార్టీ ముఖ్య నేతలు భావించారు. ఇలా కొనసాగితే వైసీపీ మళ్లీ పుంజుకుంటుందని అనుకున్నారు.
కానీ జగన్ అనూహ్యంగా రెండు కార్యక్రమాలు పూర్తవగానే సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. ఆయన వెళ్లే వరకు పార్టీ కార్యకర్తలకు ఈ విషయం తెలియదట. బెంగళూరులో ఏమైనా అత్యవసర పనులు ఉన్నాయా.. అంటే అదీ లేదు.
జగన్ కొన్నాళ్లుగా నడుము నొప్పితో బాధపడుతున్నారు. బెంగళూరులోనే దీనికి చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడ, గుంటూరు పర్యటనల్లో ప్రసంగించిన సమయంలో జగన్ ఒకింత ఇబ్బంది పడినట్టు అందరూ గమనించారు. ఈ క్రమంలోనే నడుము నొప్పికి సంబంధించి చికిత్స కోసం బెంగళూరు వెళ్లారన్నది పార్టీ వర్గాల మధ్య చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే జగన్ లేకపోతే.. పార్టీ కార్యక్రమాల పరిస్థితి ఏంటనేది.. ప్రశ్నార్థకంగా మారింది.